Saturday, May 24, 2008

’అధ్యాత్మికత’ అంటే ఏమిటి:

నా వ్యాసానికి కామెంటుగా ఒక చదువరి (anonymous) ఈ క్రింద ప్రశ్న అడిగారు:

"Being a philosophy teacher and UG's friend could you please explian / define spirituality."

దానికి నా సమాధానం:

'Spirituality' (ఆధ్యాత్మికత) ని ఎలా నిర్వచిస్తానో చెప్పమన్నారు: ఈ పదాన్ని రకరకాల వారూ రకరకాలుగా వాడతారు: సాధారణంగా, భౌతిక విషయాల మీద అంతగా ఆసక్తి చూపక, దైనందిన కృత్యాలకూ, గమ్యాలకూ అతీతంగా జీవితానికి వేరే అర్ధం ఉన్నదనీ, దాన్ని గ్రహించి సాక్షాత్కారం చేసుకోవాలనీ, దానికి అనుగుణంగా జీవితాన్ని సాగించుకొని సార్ధకం చేసుకోవాలనీ, అంతకన్నా ముఖ్యంగా మన స్వస్వరూపం ఏమిటో, ’నేను’ అనేది ఏమిటో తెలుసుకోవాలనుకోవాలనే ఆసక్తి చూపడం. ఇలాంటి ఆసక్తిని వివిధ మతానుయాయులు వారివారి మత విశ్వాసాలతో జోడించుకుంటారు: ఉదాహరణకు, ఆత్మ, పరమాత్మ, పునర్జన్మ, దైవము, కర్మ, ప్రార్ధన, ధ్యానము లాంటివి.

నాకు మత సంబంధమైన నమ్మకాలేవీ లేవు. అయినా నేను కూడా ఒక్కొక్కప్పుడు ఆ పదాన్ని ఉపయోగిస్తూంటాను. ’నేను’ అనేది ఎవరు అనే అన్వేషణే ఆధ్యాత్మికత అని నా ఉద్దేశ్యం. ఈ అన్వేషణలో నాకు తెలిసింది తెలియనిదాన్నించి విడతీసి, తెలిసిన దాంతోనే నా అన్వేషణని చెయ్యడానికి ప్రయత్నిస్తాను. ఈ విధంగా కలిగే జ్ఞానం వల్ల మన జీవితంలో ఒక పరిణామం వచ్చి, మనం జీవితంతో సమాధాన పడగలమని అనుకుంటాను. ఈ సందర్భంలోనే జీవితానికి సంబంధించిన ఇలాటి అన్ని విషయాలమీదానా, ఉదాహరణకి, వాంచలూ భయాల్ని గురించీ, పరస్పర సంబధాల గురించీ, నైతికి విషయాలకు కూడా నా అన్వేషణ వ్యాపిస్తుంది. నాకు తత్త్వ శాస్త్రంతో ఉన్న పరిచయం ప్రాతిపదికగా నేను జిడ్డు కృష్ణమూర్తి దగ్గర్నించీ, యూజీ దగ్గర్నించీ నేర్చుకున్న విషయాలు నాకు చాతనైన విధంగా, తోచిన విధంగా ఈ వ్యాసాల్లో విశదం చెయ్యడమే నా యత్నం. ఇలాంటి అన్వేషణనే మీరు ధ్యానం అనుకుంటే నాకు అభ్యంతరం లేదు.

వచ్చే వ్యాసాల్లో జీవితం అర్ధం, నీతి, ధ్యానం చెయ్యడంలో సమస్యలు లాంటి శీర్షికలకింద వ్యాసాలు రాయాలని ఉద్దేశిస్తున్నాను.

Thursday, May 22, 2008

కోర్కెలు, వెలితి, అశాంతి, జీవితార్ధం

అయితే ఈ కోర్కెలనేవి ఎలా కలుగుతాయో చూద్దాం: గత క్షణాల్లో మనం నిమగ్నులమై ఉన్న అనుభూతి ఏమైనా మనకు గుర్తు వచ్చిందనుకోండి. దానిని తిరిగి అనుభవిస్తున్నప్పుడు దాన్ని ఇతరమైన వస్తువుగా చూస్తున్నాము కాబట్టి అది లేదనే వెలితి మనకు అనిపించి దాన్ని దరిచేర్చుకోవాలననీ,దాన్ని పొందాలనీ కోరుకుంటాము. ఆ అనుభూతి బాధాకరమైనదిగా అనిపిస్తే దాన్నుంచి దూరంగా జరిగి పోవాలనుకుంటాము. మన కోర్కేలు, అసహ్యాలూ ఈ విధంగా ఏర్పడతాయి. సుఖాన్వేషణ, దుఃఖనివారణ ఇలాంటి యత్నానికి ముఖ్య లక్షణాలు. మనం పునరావృత్తం చేసి చూచుకునేప్పుడు ఒక వెలితిని గానీ, భయాన్నిగానీ అనుభవించడమే మన మనసులో అశాంతిని కల్పిస్తుంది. మన కోర్కెల ధేయమంతా ఆ వెలితినీ అశాంతినీ తొలగించడానికే. మన రాగ ద్వేషాలకూ, కోర్కెలకూ, భయాలకూ మూలం ఇక్కడే ఉంది.

మన కోర్కెలు విఫలమైనప్పుడూ, మన భయాలతోనూ, ద్వేషాలతోనూ మనం సమాధానపడలేనప్పుడూ, మనం నిరుత్సాహమూ, నిస్పృహే కాక, ఒంటరి తనం, దీనత లాంటి క్లేశాలకు లోబడై, ఒక్కొక్కప్పుడు మనకు జీవితం మీదనే విసుగు పుట్టి, విరక్తి కలిగుతుంది. ఇలాంటి సమస్యల పరిష్కారం గురించి "సంఘర్షణ-మనశ్శాంతి" అనే వ్యాసంలో ఈ క్రింద రాశాను.

అస్థిరతా, చంచలత్వమూ మనసు స్వభావంలోనే ఉంది. స్థిమితమంటే దానికి తెలియదు. అయితే అలాంటి అస్థిర స్థితి అసహనీయం అనుకుని దాన్నించి తప్పించుకోవడానికి అది సతతమూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. కానీ ఆ ప్రయత్నం చేసినకొద్దీ అ స్థిమితం దూరమవుతూనే ఉంటుంది. నిరంతరం గత స్మృతుల్ని ఙ్ఞాపకం, భవిష్యత్తుని ఊహించుకుంటూ ఉండడం, ఏదైనా వ్యాపకం కల్పించుకోవడం, వినోదాల్లోనూ, మద్యంలోనూ మునిగి పోవడం, పగటి కలలు కంటూ ఉండడం లాటి కార్యక్రమాలు మన శూన్యతనించి పలాయనం చేసే ఉద్యమంలో భాగాలు. ఈ ప్రయత్నాలన్నీ న్సిష్ఫలమైనవే. ఎందుకంటే మనం కూర్చుకున్న అనుభవాలన్నిటికీ అడుగున ఉండేది మన స్వస్వభావం ఆ శూన్యతే. దానితో ఎంత పోరాడినా అది ’నేను ఇంకా ఇక్కడే ఉన్నా’అని మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది.

ఇలాంటి పరిస్థితుల్లో ఏదో చదవడం కారణంగానో, ఎవరో చెప్పడం మూలకంగానో ఒక్కొక్కప్పుడు ఆధ్యాత్మికంలో పడతాం, దాని వల్ల మనసు దే్నిలోనైనా లగ్నమవుతుందేమో ననీ, మనకు ఏదో విధంగా శాంతి కలుగుతుందనీ, జీవితం సార్ధకమవుతుందనీ ఆశతో.

కోర్కె అనేది ఏర్పడడానికి కారణం గత స్మృతి ఏదో ఒకటి స్మ్రరణకి వచ్చి అది ఆకర్షణీయంగా కనిపించడమే. ఆ ఆకర్షణ దాన్ని గురించిన పూర్వానుభవం మీద ఆధారపడి ఉంటుంది. ఆ అనుభవం గతంలో బాధాకరమైనదైతే ఇప్పుడు అది ఏహ్యంగా కనబడుతుంది. అంటే ప్రస్తుతం దాన్ని మళ్ళారాకుండా ఎలా నివారించాలా అనే ప్రయత్నం. ఈ విధంగా కోర్కె, నివారణలు మన శూన్యతబారినించి తప్పించుకునేందుకు సాయపడతాయి. కోర్కెలోని ఉద్దేశ్యం సుఖం; పూర్వం మనం అనుభవించిన సుఖాన్ని మనం తిరిగి సంపాదించుకోవాలనే. ఆలాగే, నివారణలోని ఉద్దేశ్యం పూర్వం మనం అనుభవించిన దుఃఖాన్ని పునరావృత్తం కాకుండా నివారించుకోవాలని. ఈ విధంగా క్లుప్తంగా చెప్పాలంటే మన మానసిక జీవితం అంతా కోర్కెల ద్వారా సుఖాపేక్ష, నివారణ ద్వారా దుఃఖ నిరోధం కోసమే.

యూజీ అన్నట్టూ, మనో ప్రవృత్తి అంతా మన జీవితం అంతా ఒక్క క్షణం కష్టం లేకుండా శాశ్వతంగా, నిర్విరామంగా సుఖంగా ఉండాలనే ప్రాతిపదిక మీద జరుగుతుంది. కాని దురదృష్టవశాత్తూ అలాంటి శాశ్వతత్వం అసంభవం. అలాంటి శాశ్వతాన్వేషణే మానవ దుఃఖానికి మూలకారణ మంటారు యూజీ. ఆ అన్వేషణే మన అనుభవాల్ని ఒక గొలుసులాగా కలిపి వాటిని ఎడతెగకుండా చేసి మనకి మనో స్థితులని కల్పిస్తుంది. అదే లేకపోతే ఏ అనుభవానికి ఆ అనుభవం ప్రత్యేకమై, తక్కిన అనుభవాలతో లంకె లేకుండా, మనో స్థితులను కల్పించకుండా ఉంటుంది. కోపం, భయం, అసూయ, ద్వేషం, ప్రేమ (మనం ప్రేమ అనుకునేది), దీనత లాంటివన్నీ మనో స్థితులు. మన మానసిక సమస్యలన్నీ మనో స్థితులకి సంబంధించినవే. క్షణంలో పుట్టి మరో క్షణంలో పోయే అనుభవాలలో మానసిక సమస్యలుండవు. మనో స్థితులకి కాలంలో కొంత వ్యవధి ఉంటుంది. వాటి వల్లనే మనకి కాలమనే భావం కలుగుతుంది. మన మానసిక సమస్యలన్నీ కాలభావంలో పుట్టినవే. రాగ ద్వేషాలకూ, భయోత్సాహాలకూ, ఈర్ష్యాసూయలకూ, గొప్పతనానికీ, న్యూనతా భావానికీ, ఇన్నెందుకు, మన మానసికానుభవాలన్నీ కాలానుభవం ద్వారానే జరుగుతాయి. కాలం మనకు ఆశని కల్పిస్తుంది, నిరాశనూ కల్పిస్తుంది. వార్ధక్యం, జాడ్యం, మృతి విషయమై భయాన్ని కూడా ఏర్పరుస్తుంది. అందుకనే ఒక వైపు మన వాంఛా ప్రవృత్తి అంతా కాలం ప్రాతిపదిక మీదే జరుగుతున్నా, మరొకవైపు అది మనకు పరమ శతృవుగా కనిపిస్తుంది. దీనికి ముఖ్య కారణం మన మానసిక జీవితానికే కాలంలో ఒక అవధి ఉంటుందని మనం ఊహించుకోవడమే. అందుకనే కాలం పేరుతో ఒక దైవాన్ని కూడా సృష్టించాం (దీన్ని బౌద్ధ మతంలో చూడోచ్చు -- కాల చక్ర ధ్యానానికి బౌద్ధ మతంలో ఎంతో ప్రాధాన్యం ఉంది.)

మన మానసిక సమస్యలన్నిటికి మూలమైన పరిషకారం కావాలంటే కాలంలో మన మనో స్థితుల అవిరతత్వానికి ఆఘాతం కలిగించాలన్నమాట. అయితే అది ప్రయత్న పూర్వకంగా జరిగే పని కాదు. కారణం ప్రయత్నం కూడా కాలంలో జరిగే వ్యాపారమే కనక. ఏయే విషయాలపై మనం రాగ ద్వేషాల్ని ఏర్పరచుకున్నామో ఆ విషయాలపైన మన వ్యామోహాన్ని విసర్జిస్తే, మానసిక సమస్యలకి తావే ఉండదు. అయితే ఇలాంటి పరిష్కారాన్ని మనం ఆమోదించలేం. వ్యామోహాల్లేకపోతే, కోర్కెల్లేకపోతే ఇంక బతకడం ఎందుకూ అని మన మనసు ప్రతిఘటన చేస్తుంది. ఇక్కడ మనం చేస్తున్న పొరబాటేమిటంటే వ్యామోహం లేకపోవడం కోర్కెల్లేకపోవడం ఒకటే అనుకోవడం. జీవించడనికి మనకి కొన్ని విషయాలు అవసరం. అవిలేకుండా మనం బతకలేం. ఉదాహరణకి తినడానికి ఆహారం, కట్టుకోడానికి బట్టా, ఉండడానికి ఇల్లూ, సంతానోత్పత్తికి లైంగిక వ్యవహారం. అయితే వీటిల్లో ప్రత్యేకంగా ఫలానాది ఉండాలి, లేకపోతే బతకలేమూ అనుకోవడమే వాటిపై వ్యామోహ పడడం. వ్యామోహమంటే ’ఇది లేకపోతే నాకు జరగదు’ అనుకోవడమే. అదే మన రాగ ద్వేషాలకీ, అంతిమ పర్యవసానంలో మన దుఃఖానికి కారణం. మరో మాటలో చెప్తే మనం సుఖాన్వేషణలోనూ దుఃఖనివారణలోనూ మునిగి ఉన్నంతకాలం మనకి దుఃఖం తప్పదు.

Sunday, May 18, 2008

నేనెవరు?

ఆలోచనా స్వభావం: ఉన్న చోటూ, ఉన్న క్షణమూ కాక మరో చోట మరో క్షణంలో ఉండడమే మనో లక్షణం. ఆలోచనా వ్యాపారం ఎలా కొనసాగుతుందో కొంచెం పరిశీలిద్దాం. అసలు ఆలోచన అంటే ఏమిటి? మనం ఒక విషయం గురించి ఆలోచిస్తున్నామూ అంటే దాని విషయమైన ఒక ప్రతీకగానీ, ప్రతిరూపం గానీ, ఒక శబ్దం గానీ మన మనసులో దాన్ని సూచిస్తుంది. ఆలోచన ఆ ప్రతిరూపం ద్వారా అ విషయంలో ఒక నిర్ణయం చెయ్యడమే. ఉదాహరణకి: ఆ నిర్ణయం "ఇది సిరా బుడ్డి," "ఈ సిరా బుడ్డి బల్లమీద ఉంది," "ఇది నాకు చాలా ఉపయోగపడుతుంది," "దీన్లో సిరా అయిపోయింది," "ఇంతకంటే మంచి సిరా కొనాలి," లాంటి ఆలోచనలన్నీ నిర్ణయాలే. ఒక వస్తువుని గానీ, ఒక మనిషిని గానీ, ఫలానా అని గుర్తు పట్టడంలో కూడా ఒక నిర్ణయం ఇమిడి ఉంది. "ఇతను సూర్యనారాయణ" అని నిర్ధారించడంలో "అతను మంచివాడు," "అతను నాకు కావాల్సినవాడు," "అతను నన్ను నిన్న తిట్టాడు," "అతని పని పట్టాలి," ఆ గుర్తింపులో మనకు స్పష్టంగా తెలిసిగాని, తెలియకగాని, ఇమిడి ఉన్నాయి. అంటే గుర్తింపులో ఒక విషయాన్ని గురించిన నిర్ణయమే కాక, దాన్నిగురించి మనం గతంలో ఏర్పరచుకున్న విలువలు కూడా ఇమిడి ఉన్నాయి.

ఈ ఆలోచనే ’నేను ’ అనే పదార్ధాన్ని కల్పిస్తుంది. ’నేను " అనేది ప్రధమ పురుష సర్వనామము. మనం నిష్పాక్షికంగా పరీక్షించి విశ్వంలో గల వస్తువుల్ను జాబితా వేస్తే ఆ జాబితాలో ’నేను’ అనేది కనిపించదు. చరాచర జీవులున్నాయి, నిర్జీవమైన వస్తువులున్నాయి, ఇతర మనుషులున్నారు, ఆకాశం ఉంది, గ్రహాలూ, నక్షత్రాలూ, పాలపుంతలూ ఉన్నాయి. కాని నేను అనేది ఎక్కడా కనబడదు. వ్యక్తినిగురించి అధ్యయనం చేసే మనస్తత్త్వశాస్త్రం కూడా ’నేను’ గురించి ఏమీ పలకదు. ఆ భావం పర్యవసానాల్ని, మనకు ఉండే లోప భావం వల్ల కలిగే సమస్యల్నీ అధ్యయనం చేస్తుంది. ఎందుకంటే ’నే్ను’ అనేది ఒక విషయం కాదు కనక. ఆ భావం ఎలా కలుగుతుందో మనకు బోధించదు. అయితే మరి నేను అనేది ఉన్నదనే భావం మనకు ఎలా కలుగుతుంది?

ఏ అనుభూతి అయినా మనకు కలిగినప్పుడు మనకు ఇది కలుగుతోందనే ఎరిక ఉండదు. ఆ అనుభవంలో ’నేనూ - ఇతరమూ’ అనే విభజన ఉండదు. మన స్మృతి ద్వారా ఆ అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకుని, ఇది ఫలానా అని నిర్ణయించుకునే క్షణంలోనే, ఆ అనుభవం నాది, నాకు కలిగింది అనుకున్నప్పుడే ఆ ’నేను’ అనే భావం ఉదయిస్తుంది. ఏ అనుభవంలోనేనా మనం పూర్తిగా నిమగ్నులమై ఉన్న క్షణంలో నా ఉనికికి స్థానం లేదు.

మరో విశేషమేమిటంటే ఇలా ఏర్పడ్డ ’నేను’ వట్టి నేనే కాదు; నా పూర్వ స్మృతులద్వారా చేసే నిర్ణయంకూడాను. "ఈ అనుభవం చాలా బాగుంది;" "ఆ అనుభవం ఎంతో బాధాకరమైంది" అనే నిర్ణయం కూడా నేనే. అలా అనుకుంటున్నప్పుడు, మరో క్షణంలో ఆ నిర్ణయం కూడా నాదే అనే భావం కలుగుతుందే గాని, ఆ నిర్ణయం, ఆ ఆలోచనేననే భావం మనకు కలగదు. ఆక్కడే ’నేను’ అనే భ్రమ ఏర్పడుతుంది. కాకపోతే, ఈ నిర్ణయాలూ, ఆలోచనలకి భిన్నంగా ’నేను’ అనేది ఎక్కడుందో ఆలోచించండి.

ఈ నిర్ణయాలు ఏ దృక్పథంనించి చేస్తాం? వాటికి ఏదో ప్రాతిపదిక ఒకటి ఉండాలి కదా? ఆ దృక్పథం, ప్రాతిపదిక మన గతంలో మనం సంపాదించుకున్నవే. ఉదాహరణకి, మనకి చిన్నప్పుడు అమ్మ పెట్టిన వంకాయకూర మొదట్లో నచ్చకపోయినా, రెండవసారి, మూడవసారి తినగా తినగా, అది మనకు బాగా రుచించడమే కాక (మొదటి కొద్దిసార్లూ కొంత గత్యంతరం లేక తిన్నప్పటికీ), మరే కూరలు తిన్నా వాటిని అమ్మ వండిన వంకాయకూరతో పోల్చి, "అబ్బే, ఇదేం బాగోలేదు" అని నోరు చప్పరించేస్తాం. ఆ విధంగా ఆ అమ్మ వండిన వంకాయకూర తిన్న అనుభవం తక్కినకూరల్ని పోల్చిచెప్పే నిర్ణయాలకి ప్రాతిపదిక కావడమే కాకుండా, మన ఉనికికే అధారమవుతుంది. ఒక విధంగా చెప్తే, ఆ వంకాయకూర, దాన్ని తిన్న అనుభవమే ఆ క్షణానికి ’నేను’ అనేది. అంటే ఏయే అనుభవాలతో సముఖంగానో విముఖంగానో వ్యమనం తాదాత్మ్యంపొందుతామో ఆ అనుభవాలే ’నేను’ అనేది. అంతకంటే ’నేను’ అనేది వేరే లేదు. కాకపోతే మన ఆలోచనలకీ, నిర్ణయాలకీ వెనక ఒక కర్త ఉండి ఉండాలి (వాటంతట అవే జరగవు కనక), ఆ కర్తే ’నేను’ అని మనందరికీ ఒక దృఢమైన నమ్మకం.

అంతే కాదు: ఈ నేను అనే విషయంలో మనకి ఎన్నో నమ్మకాలున్నాయి. మొట్టమొదటిది ఈ ’నేను’ అనేది ఒకటే ఒకటిగా, నిరంతరంగా కాలంలో కొన సాగిపోతుంది. నేను నిన్న ఉన్నాను, రేపు ఉంటాను. నేను ఎప్పుడూ ఉండే ఉంటాను. వివిధ అనుభవాలూ నా అస్తిత్వానికి ప్రాతిపదికే అయినా, వీటన్నిటికీ వెనక ఉన్న నేను ఒక్కణ్ణే అని అనుకుంటాను. ఇది కూడా నేను అనే భ్రాంతిలో భాగమే. మనం వేరే వేరే సమయాల్లో రక రకాల ఙ్ఞాపకాల్నీ చేసుకుంటాము. అవన్నీ ఈ ’చోటే’ జరుగుతున్నయ్యి కనక, వాటన్నిటికీ వెనక ఉండే నేను ఒక్కణ్ణే అనుకుంటాము. ఈ ఙ్హాపకాలు మన స్మృతిలో ఒకదానిలో ఒకటి చొచ్చుకుపోయి ఉండకపోతే మనం నిరంతరమైన వ్యక్తి అనే భావం మనకు కలగదు.

నాకు ఒక మొదలు ఉందని నేను ఊహించుకోలేను, నేను ఎప్పుడో (భౌతికంగా) పుట్టానని నా తల్లిదండ్రులూ, బంధువులూ చెప్పినా కూడాను. అలాగే నా చుట్టూ ఉండే కొందరు చనిపోయినా, పుట్టినవాడు గిట్టడం తప్పదని నేనే నమ్మినా, నా చావును నేను ఊహించుకోలేను. ఒకవేళ నేను చచ్చిపోయినట్టు ఊహించుకున్నా నా చావును పైనుంచి పర్యవేక్షిస్తూ నేనే దానికి అధ్యక్షత వహిస్తాను.

ఇలా ఏర్పడ్డ ’నేను’ అనే భావం మన మానసిక జీవనానికి కేంద్రం. నా ఉద్దేశ్యంలో, నాకు గతమూ, వర్తమానమే కాక, భవిష్యత్తు కూడా ఉంది. నాకు శక్యత ఉన్నది. ఆ శక్యతని నేను సఫలం చేసుకోవాలి. నా కోర్కెలకి అడ్డువచ్చినవారందరూ నాకు విరోధులు, శతృవులు. ఇతరులు నా గురించి ఫలానా విధంగా అనుకుంటున్నారు అని ఊహించుకుని దానికి తదనుగుణంగా నేను ప్రవర్తిస్తాను. నేను అనేదాన్నిసర్వ విధాలా రక్షించుకోవడానికి ప్రయత్నిస్తాను, దానికి అవసరమైన సాధన సామాగ్రినీ, ఆయుధాల్నీ, శక్తినీ కూడబెట్టుకుని.

నాకోర్కెలే నాకు ముఖ్యం. నా సుఖాలే నాక్కావాల్సినవి. నేను ఇతరులకి సహాయం చేసినప్పుడు కూడా నాకు ముఖ్యంగా కావాల్సింది నా సుఖమే.

సుఖమూ, సంతోషమూ, ఆనందమూ

మన మానసిక జీవితాన్ని తరిచి చూస్తే అన్నిటికంటే మూలంగా కనిపింఛేది సుఖాన్వేషణా, దుఃఖనివర్తనా. మన మానసిక అన్వేషణ అంతటికీ గమ్యం సుఖంఏననిపిస్తుంది. కాకపోతే మనం కావాలనుకున్నవన్నీ మనకు లభించవు. వాటిని మనం సాధించలేనఫ్పుడు, మన యత్నంలో ఆటంకాలు సంభవించినప్పుడూ, మనసుకు బాధ కలుగుతుంది. ఆగ్రహమూ, నిరాశా, నిస్పృహా, ద్వేషమూ లాంటివి ఏర్పడడం సహజం. ఆట్లాంటి వ్యతిరేక భావాలని తొలగించడానికి వివిధ ప్రయత్నాలూ చేస్తాము.

ఆలోచన: ఆలోచన మానవుల్ని తక్కిన జంతుజాలాల్నించి విడతీసి, మానవ జీవితానికి ఒక విశిష్టత నేర్పరుస్తుంది. ఆలోచన అనేదే లేకపోతే మానవుడికి తననుగురించిన ఎరుక కలగదు. ఆ ఎరుక వల్లనే తన ప్రస్తుత స్థితి సుఖవంతమైనదైనిగానీ, కష్టవంతమైనదనిగానీ తెలియదు. జంతువులకు సుఖదుఃఖాలుండవని కాదు; వాటిని గురించిన ఙ్ఞానం ఉండదు. తనని గురించిన ఎరుకవల్లనే ప్రపంచానికి భిన్నంగా తనకి ఒక ఉనిక ఉన్నదని ఊహిస్తాడు. ఆ ఎరిక కలిగిననాడే మానవజాతి వినాశానికి విత్తనాలు వేసుకున్నాయంటారు యూజీ.

తాను ప్రత్యేకమైన వ్యక్తిననే భావం కలగడం వల్లనే తనను తను రక్షించుకోవాలని, తనలో ఉన్నాయనుకున్న వెలితిని పూరించుకోవాలనీ సదా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆలోచన అనే సాధనం మూలంగా తనకి ప్రస్తుతానికి అవసరం లేకపోయినా, భవిష్యత్తులొ భద్రత కోసం పాకులాడుతాడు. రాబోయే ప్రమాదాల్ని ఊహించుకుని సతతమూ తన చుట్టూ గోడలు కట్టుకుంటాడు. తోటివాళ్ళతో ముఠాకట్టుకుని ఇతరులతో పోరాటానికి దిగి, తన ఆస్తి కోసం, తన వాళ్లకోసం, తన దేశం కోసం, తన మతం కోసం, తన జాతి కోసం తాను శతృవులనుకున్న వాళ్ళని చంపడానికీ, చివరికి చంపబడడానికి కూడా సిద్ధమౌతాడు.

మన ఆలోచన వల్లనూ, మన ఙ్ఞాపకశక్తి వల్లనూ మన మనోస్థితులకు ఒక ఉనికీ, వ్యవధీ ఏర్పడుతాయి. నిన్న నన్ను ఎవడో అవమానించాడనుకోండి. దాని వల్ల నా మనసు నొచ్చుకుంటుంది. ఆ బాధని నేను పదే పదే ఙ్ఞాపకం చేసుకుని దానికి ప్రాణంపోస్తూ, దాన్ని ఒక మనస్థితిగా మార్చుకుంటాను. మనసులో దాన్ని తిరగ వేసుకున్నకొద్దీ దానికి మరింత తీవ్రత ఏర్పడుతుంది. అదే విధంగా అవతలవాడి మీద మనకున్న కసి కూడా ఎక్కువవుతుంది. ఈ విధంగా పూర్వపు ఙ్ఞాపకాన్ని నెమరు వేసుకోకపోతే, ఆ బాధ తీవ్రత క్రమేణా క్షీణించి సమసిపోతుంది.

సుఖం కూడా అలాంటిదే. ఏదో ఒక పాటని విని ఆనందించాం అనుకోండి. ఆ అనుభవాన్ని మనం ఆ క్షణంతో పోనివ్వం. దాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ, దాన్ని ఇతర అనుభవాలతో జత చేసి, దాన్ని పోల్చిచూచి, దానికి విలువ కట్టి, అలాంటి అనుభవాలూ ఇంకా ఇంకా కావాలనుకుని సుఖాన్వేషణకు పూనుకుంటాం. ఆ క్షణికమైన ఆనందాన్ని సుఖమనే మనోస్థితిలోకి మార్చామన్నమాట. ఆ ఆనందం వ్యవధిని వీలైనంతగా పొడుగించడానికి ప్రయత్నిస్తాం.

అయితే దీన్లో ఒక అసంబద్ధత ఉంది: మనం నిమగ్నులమై ఉన్న ఆనందానుభూతి మనకు దాన్ని గురించిన ఎరుకలేనంతవరకే ఉంటుంది. ఆ ఎరుక కలిగిందో, అదే క్షణంలో మనకూ మన అనుభూతికీ విభాగం ఏర్పడి మనకి దాన్ని దూరం చేస్తుంది. మిగిలింది ఆ అనుభూతియొక్క ఙ్ఞాపకం మాత్రమే. ఆ స్మృతి ద్వారా మన గత ఆనందాన్ని తిరిగి తిరిగి ఊహించుకుంటూ, దాన్ని, లేదా అలాంటి మరోదాన్ని పునఃస్సృష్టించుకోవడానికి తాపత్రయ పదతాం.

మానవ దుఃఖానికి ముఖ్య కారణం "శాశ్వతంగా జీవితమంతా సుఖంగా ఉండాలి, దుఃఖం ఒక్క క్షణమైనా ఉండకూడదు," అనుకోవడమేనంటారు యూజీ.

ఏ అనుభూతిలోనైనా -- అది కోపం కానీండి, భయం కానీండి, అసూయ కానీండి, బాధ కానీండి, సుఖం కానీండి -- పూర్తిగా నిమగ్నులమై, దాని ఎరికే లేకుండా ఉంటే మనకు సమస్యలే ఉండవు. అయితే మనకు అవ్వకావాలి బువ్వాకావలి అన్నట్టు ఒకవైపు అనుభూతిలో నిమగ్నతా కావాలి, రెండో వైపు దాన్ని గురించిన ఙ్ఞానం, ఎరికా ఉండాలి. ఆ అనుభవం నాదే, నాకు దాని మూలంగా ఎంత సంతోషమో అనుకుంటూ చంకలు కొట్టుకోవాలి.

ఇందులో మరో సమస్య కూడా ఉంది: మన మనసూ, అలోచనా ఏదో అశాంతతనుంచి తప్పించుకొని ఒక గమ్యానికి చేరి ఆ గమ్యంలో స్థిరపడి విశ్రాంతంగా ఉండాలని నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. ఆ గమ్యాన్ని ఏదో విధంగా ఒక వేళ సాధించినా, ఆ గమ్యంలో మనం విశ్రాంతిగా నిమగ్నులమై ఉండలేము. ఆ గమ్యాన్ని చేరుకున్నామని మనకి తెలియాలి. కాకపోతే అదే ఙ్ఞానం ఆ గమ్యాన్నించి మనని వేరుచేసి, మళ్ళా అదే గమ్యానికో, మరో గమ్యానికో మనని చోదిస్తూనే ఉంటుంది. మనని ఏ ఒక్కచోట నిలకడగా ఉండనివ్వదు. ఈ విధంగా మన మానసిక జీవితంలో అస్వస్థత, అశాంతి నిబిడీకృతమై ఉన్నవి. దీనికి కారణం మన మనసుకూ, ఆలోచనకూ గల స్వభావమే.

ఆత్మ విద్య, ఆత్మ జ్ఞానం:

ఈ మాటలకి అర్ఢం వేదాంతంలో చెప్పేలాగా కాకుండా, లౌకికంగా అర్ధం చెప్పుకుందాం. మనని గురించి మనం తెలుసుకోవడమన్నమాట. ఉపనిషత్తుల్లో చెప్పే ఆత్మ విద్య దీనికీ ఒక సామ్యత ఉన్నది -- అదేమిటంటే సాధారణ ప్రపంచజ్ఞానానికి భిన్నంగా ఈ జ్ఞానానికి గల విశేష లక్షణం అది కలగడం వల్ల మనలోనే మార్పు అప్రయత్నంగా కలుగుతుంది. ఉదాహరణకు, మనం ఎంతగానో విశ్వసిస్తూ, ఆధారపడే వ్యక్తికి మనమీద వాస్తవంగా అంత ఆసక్తిగానీ ప్రేమగానీ లేవనీ, అతని మీద పెట్టుకున్న భరోసా అంతా వ్యర్ధమేననీ గ్రహింపుకి వచ్చిన వెంటనే ఆ వ్యక్తి నించి దూరంగా జరిగిపోతాం. ఒకరి మీద ఎంతో ప్రేమ అనుకుంటూ ఆమె వెనక వేళ్ళాడుతూ తిరుగుతున్నా, ఆ ప్రేమ సఫలంకాక తాను సంక్షోభంలో ఉన్న సమయంలో ఒక్క క్షణం ఆప్రేమంతా కేవలం ఆధారపడడమేననీ, ఎవరో ఒకరు తనను ప్రేమిచాలనుకోవడం ఉత్త భ్రమేననీ, మనసుకు పట్టిన పిచ్చేననీ స్పష్టంగా అనిపించిందా, ఆ సంక్షోభం అంతా ఒక్క నిమిషంలో మాయమయిపోతుంద్. ఆ జ్ఞానం మనలో అప్రయత్నంగానే మార్పును తెస్తుంది. అలాంటి మార్పు అవగాహనమీద ఆధారపడి ఉంటుంది. నేను ఇక్కడ ప్రస్తావించే జ్ఞానం అలాంటిది. ఇలాంటి జ్ఞానానికి అవధి ఏదో ఒక ప్రస్తుత సమస్యా పరిష్కారం కావొచ్చు, మన మానసిక జీవితం మొత్తం పెల్లగిలిపోయి జీవితానికి పునాదులే లేకపోవడం కావొచ్చు. చివరికి అంతా భీభత్సం అయినట్టు అనిపించినా దానివల్ల జీవితానికి హాని ఉండదు; జీవితం మరో విధంగా నడుచుకుంటుంది, అంతే. ఆత్మ జ్ఞానానికి ముఖమైన పర్యవసానం ఆత్మ విమోచన. ఆ పర్యవసానం దృష్ట్యా చూస్తే, ఆ గమ్యానికి చేర్చగలిగితే నమ్మకానికీ, అనుమానానికీ, సత్యానికి పెద్ద తేడాలుండవు.

ఈ సందర్భంలో ఒక ప్రశ్న ఉదయించక తప్పదు: అయితే జీవితానికి నిశ్చితమైన ఒక ఆధారం అంటూ ఉండదా అని. జీవితానికి వేరే ఆధారం అవసరం లేదు. దానికి అదే ఆధారం. జీవితానికి రెండే రెండు ధ్యేయాలంటారు యూజీ: బ్రతుకు తెరువు (survival), సంతానోత్పత్తి (reproduction). తక్కిన ధ్యేయాలన్నీ మనం మన ఆలోచనాప్రవృత్తి ద్వారా తెచ్చిపెట్టుకున్నవే నంటారు.

* * *

Saturday, May 10, 2008

ఒక చిన్న ప్రకటన:



ఇన్నాళ్ళూ నిశ్శబ్దంగా ఉండడానికి కారణం ఇతర వ్యాపకాల్లో ముణిగి ఉండడమే. ముఖ్యంగా ’ధ్యానం మీద ఆలోచనలు’ 'Reflections on Meditation' అనే శీర్షిక కింద ఒక వ్యాసం రాయడం. దాన్ని ఇప్పుడే పూర్తి చేసి నా ఇంగ్లీషు బ్లాగులో వేశాను. మీకు ఇంగ్లషులో చదవడానిక వీలుంటే http://moortysblogpage.blogspot.com లో చదువుకోండి. తెలుగులోకంటే ఇంగ్లీషులో రాయడం నాకు సులువు హెచ్చు కనుక ముందర ఆ భాషలో రాస్తున్నాను. కాలక్రమేణా తెలుగు బ్లాగులో కూడా ఇలాంటి విషయాల గురించి రాస్తూనే ఉంటాను.