Thursday, September 9, 2010

నీతి గతి ఏమిటి?

(తక్కిన కొన్నివ్యాసాలలాగానే ఇది కూడా నా ఇంగ్లీషు వ్యాసం నించి స్వేచ్ఛానువాదం. చదవడానికి వీలుగా ఉంటుందని అవసరమైన చోట కొద్ది ఫుట్ నోట్స్ ను చేర్చాను.)

"నీతి అంటే ఏమిటి? నీతి అంటే ఎవరో అదేశించిన నీతి నియమాలని అనుసరించడం కాదు. ఆకర్షణలకు అతీతంగా ఉండడమూ కాదు. ద్వేషాన్నీ, కోపాన్నీ, దురాశనీ, కామాన్నీ, దౌర్జన్యాన్నీ అదుపులో ఉంచుకోవడమూ కాదు. ముందూ తరవాతా చేతల్ని ప్రశ్నించడం వల్లనే నీతి అనే సమస్య ఉద్భవిస్తుంది. ఈ పరిస్థితికి కారణం తప్పు ఒప్పుల్ని విచక్షించే శక్తీ, దాన్ని అనుసరించి మన కార్యాల్ని మలుచుకోవడానికి ప్రయత్నించడమూ.

జీవితం అంటే చేత. ప్రశ్నించకుండా చేసే కార్యమే నీతి. నీ చేతలని నువ్వు ప్రశ్నించడంవల్ల జీవిత్ ప్రకాశమే నాశనమవుతుంది. ఆలోచన రక్షణా కవచం లేకుండా జీవితాన్ని దానిదోవ దానినే వ్యక్తం చేసుకోనిచ్చేవాడికి రక్షించుకునేందుకు ఒక ఆత్మ అంటూ ఉండదు. అసత్యం పలికేందుకు గానీ, నటించడానికి గానీ, తన చుట్టూ ఉన్న సంఘం అవినీతికరమైందిగా భావించే ఏ కార్యన్నైనా చేసేందుకు అతనికి ఏం అవసరం ఉంటుంది?" -- Mystique of Enlightenment లో యూజీ.

మనకి ఇష్టం ఉన్న లేకపోయినా మన కార్యాల్నిమనం ప్రశ్నించుకుంటూనే ఉంటాం. ఉదాహరణకి, మన కార్య పర్యవసానాలని గురించి మనం ఆదుర్దా పడుతూనే ఉంటాం -- అవి మనం ఆశించినట్టుగా ఉంటాయా, మనకి గానీ పరులకి గానీ హాని కలిగిస్తాయా అనీ, మన కార్యాలకు కొన్ని పర్యవసానాలు సంభవిస్తే మనకి ఏమవుతుందీ అనీ. మనం పూర్వం నమ్మినట్టి తప్పొప్పుల, మంచిచెడుల ప్రమాణాలకి మన కార్యాలు వ్యతిరేకంగా జరిగినట్టయితే, మనం అపరాధం చేసినట్టు భావిస్తాము; మన కార్యాలకి మనం కావాలనుకున్న ఫలితాలు రాకపోతే మనసులో చింతపడతాం; వస్తే సంతోషిస్తాం.


ఏదైనా నైతిక సిద్ధాంతం (నైతికి నిర్ణయాలగురించిని సిద్ధాంతం) సబబైనదా కాదా, ఉదాహరణకి ఉపయోగితావాదం (Utilitarianism1) విధివాదం (Deontologism2) కంటే మేలైనదా, సుఖవాదాన్ని (Hedonism3) అంగీకరించాలా అహంవాదాన్ని (Egoism4) అంగీకరించాలా, అనే ప్రశ్నలతో నాకు ప్రమేయం లేదు. నైతికి నిర్ణయాల విషయంలో ఏదో ఒక ప్రమాణాన్ని మనం చేపట్టినప్పటికీ, మనం పెద్ద సమస్యనొకదాన్ని ఎదుర్కోవడం తప్పదు.

ఆ సమస్య ఏమిటంటే నీతి విషయాల్లో మన చేతలు తప్పా ఒప్పా అని మథనపడటమే కాదు; మనమే ఒప్పని స్వీకరించిన వాటికి అనుగుణంగా మనం ఆచరించడక పోవడమే. మొట్టమొదట ఆరిస్టాటిల్ అజితేంద్రియత్వపు (incontinence) సమస్యతో కుస్తీపట్టాడు. ఈ సమస్య క్రైస్తవ మతంలో ఇచ్ఛాబలహీనత సమస్యగా రూపొందింది: "మనసు చెయ్యాలనుకుంటుంది గానీ శరీరం దానికి లోబడదు."
___________________________________________
1 జాన్ స్టూవర్ట్ మిల్, జెరెమీ బెంథెమ్ అనే ఇంగ్లీషు తత్త్వజ్ఞులు ప్రతిపాదించిని నైతిక సిద్ధాంతము: ఏయే కార్యములు జనాధికానికి సుఖపర్యవసాన కారకమవునో అవే సరైన కార్యములు. దుఃఖ పరిణామ కారకమైన కార్యాలు అపసవ్యమైనవి. సుఖదుఃఖములే మంచి చెడ్డలు. వాటిని ఆధారం చేసుకునే మన కార్యాల సవ్యాపసవ్యాలని నిర్ణయించాలి.
2 విక్టర్ ఇమాన్యుయెల్ కాంట్ అనే జర్మను తత్త్వశాస్త్రజ్ఞుని నీతి సిద్ధంతము. కార్యాల నీతి అవినీతులను అవి విధికి అనుగుణంగా ఉన్నాయా వ్యతిరేకంగా ఉన్నాయా అనే దాన్ని బట్టి నిర్ణయించాలి. వ్యక్తి తలపెట్టిన కార్యము సార్వజనీనికము కాగలదో లేదో దాన్నిబట్టి విధిని నిర్ణయించాలి.
3 ఎపిక్యురస్ అనే ప్రాచీన గ్రీకు తత్త్వజ్ఞుని నీతి సిద్ధాంతము. వ్యక్తికి ఏ కార్యము సుఖమును కలగజేయునో, అనగా దుఃఖమును నివారించునో అదే సరైన కార్యము. ఈ సిద్ధాంతము ఆధునికి ఉపయోగితావాదానికి ప్రాతిపదిక.
4 నాకు (అహానికి) ఏ చేత సుఖాన్నిస్తుందో అదే సరైన చేత. ఈ సిద్ధాంతాన్ని అంగీకరిస్తే నైతిక సాపేక్షావాదాన్ని అంగీకరించడమే. నాకు సుఖకరమైన విషయము నీకు బాధాకరమవవచ్చు కాబట్టీ, ఆ పరిస్థితిలో ఒకే చేత ఒకే సమయంలో తప్పూ ఒప్పూ కూడా అవవచ్చు. అంటే ఈ సిద్ధాంతం పరస్పర విరుద్ధమైన భావాలకి తోవతీస్తుంది.
___________________________________________

సోక్రటీసు, ఆయన తరవాత ప్లేటో ఏమని చెప్పారంటే ఒక మనిషికి మంచి అనేది ఏమిటో తెలుస్తే అతను తప్పకుండ మంచివాడవడమే కాక, అవశ్యం దానికి అనుగుణంగా ప్రవర్తిస్తాడు అని. అంటే మనిషిలో ముఖ్యమైన కీడు అతని అజ్ఞానమే. ప్లేటో తన రిపబ్లిక్ అనే గ్రంథంలొ శ్రేయస్సుని గురించిన జ్ఞానానికీ మనిషి సుఖానికీ (దానిద్వారా రాజ్య సుఖానికీ) ముడి పెట్టి, వ్యక్తి (ఆ విధంగా రాజ్యంకూడా) నైతికంగా ప్రవర్తించే ఆవశ్యకతను సృష్టించాడు.

ఈవిధంగా మనం అవినీతి ప్రవర్తనకు కారణం అజ్ఞానమనిగానీ, ఇచ్ఛా బలహీనత అనిగానీ సిద్ధాంతరీత్యా అనుకున్నా మనిషి నమ్మకాలకీ, అతని సంకల్పానికీ అతని ప్రవర్తనకీ మధ్య అంతరం పోదు. తప్పొప్పుల విషయంలో మనకి ఎలాటి అభిప్రాయాలు ఉన్నప్పటికీ, మనలో అత్యధికులం ఒకవిధంగా నమ్మి, ఒకవిధంగా అని, మరొక విధంగా ప్రవర్తిస్తాం. పై చెప్పిన ఉక్తిలో యూజీ అన్నట్టుగా మన కోర్కెలూ, అవేశాలూ, మన ఆత్మ రక్షణా -- ఇవే నీతికి ప్రతిబంధకాలు.

ఒకసారి ఆచరించింతరవాత, ఒక్కోసారి ఆంతరంగికంగా మనం చింతిస్తున్నా, చేసినపని తప్పని భావిస్తున్నా, ఇతరుల సమక్షంలో మన కార్యాల్ని సమర్ధించుకోవడనికి ప్రయత్నిస్తాం. ఈ విధంగా మనం ద్వంద్వ జీవితాల్ని జీవించడం మొదలెడతాం: బైటికి, జన సమక్షంలో, మనం మంచి వాళ్ళుగా ఉండేట్టు కనబడడానికి ప్రయత్నిస్తాం; కాని లోలోపల మనం ఇతరులపై కుట్ర చేస్తూ, మన కోర్కెల్ని మనం తీర్చుకుండేలాగా చూస్తాం. ఈ విధంగా నీతి ఒక బూటకం అయిపోయిందంటే ఆశ్చర్యంలేదు.

నా మొదటి నీతి శాస్త్రపు క్లాసుల్లో "నీతి ఇతరులకు మాత్రమే"నని హాస్యంగా అనేవాణ్ణి. ఇతరుల ప్రవర్తనని మంచనిగానీ చెడనిగానీ, తప్పనిగానీ ఒప్పనిగాని చప్పున అనడనికి సందేహించం. అలాటి నిర్ణయాల్ని మన అహాన్ని పోషించుకోవడానికి తరచూ ఉపయోగిస్తాం. అంటే వాటి ద్వారా మనం ఇతరులకంటే అధికులమని భావించుకుంటాం. ఇతరులకంటే మనం ఉన్నత నైతికి స్థాయిలో ప్రవర్తిస్తున్నామని గర్వ పడుతూంటాం.

మనం అంతా జీవితం గడపటానికి ఒక జీవిత విధానానం (policy of living) కోసం చూస్తూంటాం. దాని ద్వారా మనం శాశ్వతంగా సుఖంగా ఉండి సమాజంతో సామరస్యతతో ఉండగలమని భావిస్తాం. దురదృష్టవశాత్తూ, ఒక వేళ అలాంటి విధానం ఏదైనా మనకు దొరికినా, నాకు తెలిసినంతవరకూ తన విధానాల్నీ, తన నైతికి ప్రమాణాల్నీ తనే ఉల్లంఘించని వ్యక్తిని ఒక్కణ్ణికూడా నేను ఊహించలేను, ముఖ్యంగా మరొకరు చూస్తూండనప్పుడు.

ఎందుకు ఈ నటన? అసలు నీతే ఎందుకు? తప్పొప్పుల (వాటికి మూలమైన మంచి చెడుల) ప్రమాణాలెందుకు?

ఈ విధమైన నీతికి మన జీవితాల్లో స్థానం లేదని చాలా కాలంగా అనుకుంటూ వచ్చాను. నన్ను ఈ విషయంలో అపార్ధం చేసుకోకండి: ఖూనీ, మాన భంగం చెయ్యడం, దౌర్జన్యాలూ, అబద్ధాలూ, దొంగతనాలూ, పర్యవసానలని లక్ష్యం చెయ్యకుండా ఉద్రేకంతో ప్రవర్తించడమూ -- వీటిని నేను సమర్ధిస్తున్నాననుకోకండి. (పైన పేర్కొన్న యూజీ ఉక్తిని ఆధారంగాచేసుకుని ఆయనకూడా ఇలాంటి ప్రవర్తనని సమర్ధిస్తున్నారని మీరు అపోహ పడొచ్చు -- కానీ అంతకంటే సత్యదూరమైన విషయం మరొకటి లేదు.)

ఆత్మ రక్షణత్త్వాన్నిగురించి యూజీ ప్రస్తావించారు. దురదృష్ట వశాత్తూ మన ఆత్మరక్షణ కోసం మనం మన ఆలోచననీ చేతల్నీ ఉపయోగిస్తాం. మనం వాస్తవంలో కొన్ని సందర్భాల్లో ఎలా ప్రవర్తిస్తామో చూస్తే విచిత్రంగా ఉంటుంది: మనకి కోర్కెలున్నాయి; వాటిలో కొన్ని పరస్పర విరుద్ధాలు. అలాగే మనకు భయాలుకూడా ఉన్నాయి. ఏదైనా ఒక పరిస్థిని ఎదుర్కొన్నప్పుడు మన సంఘర్షణల్ని దృష్టిలోపెట్టుకుని మన మానసికి వ్యవస్థ (mental economy) కి అనుగుణంగా ఉండేట్టు ప్రవర్తిస్తాం. నైతిక ప్రవర్తనకు నా అభిప్రాయంలో ఇంతకంటే వేరే హామీ లేదు. ఉదాహరణకి ఈ క్రింది పరిస్థితిని పరిశీలించండి:

ఒక యువతి తన అనాహ్వానిత గర్భం విషయంలో సలహాకని నాదగ్గరకి వస్తుంది. నేను జీవరక్షణ దృక్పథాన్ని అవలంబించి ఆమెను గర్భాన్ని పూరి తొమ్మిది నెలలూ మోసి, పిల్లని కనమనీ, దాన్ని పెంచే విషయంలో ఏమనా సమస్య ఏర్పడితే, ఆ పిల్లని దత్తతకి ఇయ్యమనీ ఆమెతో అనొచ్చు. లేదా, యథేచ్ఛా దృక్పథంతో అమెను గర్భస్రావం చేయించుకోమని అనొచ్చు. (వాస్తవానికి ఒకామెకు నేను ఈ విధంగా సలహా ఇచ్చాను; అది తల్లికి గానీ, బిడ్డకి గానీ మంచిదా కాదా అనే ప్రశ్ననటుంచి. కారణం, దాన్లో నా స్వార్ధంకూడా కొంత ఉంది.) నేను ఆ సలహా ఇచ్చినప్పుడు ఆమె విచారించాల్సిన చాలా అంశాల్ని నా దృష్టిలో ఉంచుకోలేదు: ఉదాహరణకి, బిడ్డ పుట్టింతరవాత ఆమె అర్ధిక పరిస్థితి ఏవిధంగా ఉంటుంది? సాంఘికంగా చెడుపేరు రావడం, బంధువుల నిందలూ, అన్నిటికంటే ముఖ్యంగా ఆమెకు కలిగే వంటరితనం, నేరభావం, తనను మరొకరు ద్రోహం చేశారనే భావం లాంటివి. ఆమెకు సలహా ఇచ్చినప్పుడు నేను ఈ అంశాలగురించి అలోచించకపోతే, ఆమె ఎదుర్కొనే ముఖ్య సమస్యని నేను పరిగణించకుండా, నా సలహాని పైనించి ఆమె తలపై రుద్దుతున్నట్టవుతుంది. అలా సమస్యను పరిష్కరించడానికి ఆమెకు సహాయ పడకపోవడమేకాక ఆమెపై మరింత వత్తిడి తెచ్చిన వాడినవుతాను. ఇక్కడ నా స్థానం న్యాయమూర్తి గానా, స్నేహితుడిగానా, లేదా సలహాదారుగానా? నిజానికి, ఈ సందర్భంలొ, తప్పొప్పులు, మంచి చెడులూ అనే పదాల్ని ఉపయోగించడం అప్పటికే ఉన్న అయోమయాన్ని ఇంకా ఎక్కువ చేసినట్టవుతుంది. ఈ విషయంలో నేను ఎలాంటి దృక్పథాన్ని చేపట్టాలి?

ఇప్పుడు ఆమెకు ఈ విషయంలో సలహా ఇవ్వాలనుకోండి. మొట్టమొదట, ఆమెకు ఇదిచెయ్యాలి, అది చెయ్యకూడదు అని సలహా చెప్పను. ఇక్కడ తప్పొప్పుల విషయం విచారించకుండా, తన మనసును తనే నిర్ధారణ చేసుకోవాలనీ, ఈ పరిస్థితిలో తనకు కలిగే భావాల్ని (feelings) శ్రద్ధగా వినాలనీ, జరగబోయే వివిధ పర్యవసానాలనీ ఆమె ఏవిధంగా ఎదుర్కొంటుందో ఆలోచించాలనీ చెబుతాను. వీటన్నిటిని విచారించిన తరవాత తను ఏవిధంగా నిర్ణయిస్తే తను జీవితంతో సమధానపడి సామరస్యంతో జీవించగలదో అలాంటి నిర్ణయాన్నే తీసుకోవాలనీ, తత్క్షణమే తాను ఓ నిర్ణయానికి రాలేకపోతే సమస్యకు పరిష్కారం అవుపించేంతవరకు దాని విషయం అలోచిస్తూనే ఉండాలనీ చెబుతాను. (అంటే అది పరిష్కారమైందాకా తను ఆ సమస్యతో కూర్చోవాలన్నమాట.) ఆమె తన సమస్యకు సరైన పరిష్కారం కనుక్కోగలిగితే ఆమె మానసిక క్షోభ తగ్గిపోయి ఆమె ప్రశాంతంగా బతకగలదనీ చెబుతాను. అప్పుడు తనకు సంబంధించినంతవరకూ తనకు ఓ పరిష్కారం లభించినట్టేనని ఆమెకు తెలుస్తుంది. తను పూర్వం చేసిన నిర్ణయం (పరిష్కారం) విషయంలో పొరపాటు పడ్డట్టు ఆమెకి అనిపిస్తే, అప్పుడు ఆ సమస్యని పునరాలోచించి పూర్వం కంటే మరింత సంతృప్తికరమైన మరో పరిష్కారాన్ని కనుక్కొంటుంది. దురదృష్టవశాత్తూ ఈ విషయంలో నియమాలేమీ లేవు. అయితే, తాను ఏవిధమైన నిశ్చయానికి వచ్చినా ఇతరుల నైతికి నిర్ణయాలని ఎదుర్కోవాల్సిఉంటుందని ఆమెకు తెలుసు. అంతే కాదు, తాను ఒంటరిగా కాక సంఘంమధ్యలో, చట్టాలమధ్యలో బతకాలని కూడా ఆమెకు తెలుసు.

మన నైతిక సందిగ్ధతలకు ఈ విధమైన పరిష్కారమార్గం తప్పొప్పు, మంచి చెడు విషయాల సమస్యనే పట్టించుకోదు. (అయితే పర్యవసానాల్ని దృష్టిలో పెట్టుకోవడంలో ఆమె ఉపయోగితావాద దృష్టితో సమస్యని చూస్తోందని మీరనొచ్చు. నా ఉద్దేశంలో అది ఆ దృష్టికంటే ఎంతో మిన్న.) ఆచరణకి ఏవో ప్రత్యేకమైన నియమాలూ, మార్గదర్శకమైన చిట్కాలూ నేను ఇస్తున్నానని కాదు. ఇంచుమించుగా మనం వాస్తవం ఈ విధంగానే ఆచరిస్తామని నా ఉద్దేశం. మన మనో వ్యవస్థలో సమత్వాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి పరిష్కారమార్గాన్ని మరింత విశాలం చేస్తే మన వాక్కులకూ చేతలకూ ఉండే తారతమ్యాన్ని తొలగించే అవకాశం ఉందని నా అభిప్రాయం. ఈ మార్గాన్ని స్పష్టంచెయ్యడమే ఇక్కడ నా ధ్యేయం. ఇది మన సమస్యలకి తేలికైన పరిష్కారం కాదని నాకు తెలుసు; కాకపోతే అంతకంటే సులభమైన మార్గ మేమిటో నాకు తెలియదు.

నేనిక్కడ రాసే విధానానికీ అంతరాత్మ చేసే అలజడిని చల్లబరుచుకునేందుకు చేసుకునే ప్రయత్నానికి పోలికలు కనిపించొచ్చు. కాని అంతరాత్మ కోర్కెల ఉద్ధృతిలో మూగపోవొచ్చు. దాని తప్పొప్పుల ఆదేశాలు మన మత, చారిత్రిక, పరసరాల, తలిదండ్రుల ప్రభావాల్నిబట్టి ఆధారపడి ఉంటాయి. వాటిని స్థిరమైనవిగా పరిగణిస్తే అవసరంలేని మరింత సంఘర్షణ పోగవుతుంది. సంఘర్షణ (అది బాహ్యమైంది కానీ, ఆంతరంగికమైంది కానీ) మనలో అత్యధికులు ఎదుర్కోక తప్పదు. నేచెప్పే విధానం ఆ సంఘర్షణని ఉద్దేశించి చెప్పింది.

”మనతో మనం జీవించడం’ అంటే నా అర్ధం మనం ఎదుర్కొనే సమస్య విషయంలో అది మన మనసులో తేటపడిందాకా, అంటే మనకి ఇది సమస్య కానంతవరకూ ప్రయత్నిస్తూండడం; అంటే మనతో మనం ప్రశాంతంగా జీవించగలిగేంత మేరకు ఆ సంఘర్షణకి ఒక తీర్మానం తీసుకురావడం. అయితే అలా దానికి తీర్మానం కలిగిందో కలగలేదో నిర్ణయించడానికి న్యాయమూర్తి మీరే.

నేను అబద్ధాలాడి, ఇతరుల్ని మోసం చేసి, వాళ్ళ కాళ్ళకింద గోతులు తవ్వికూడా నాతో నేను ప్రశాంతంగా ఉండకూడదా అని మీరు ప్రశ్నించొచ్చు. కారణం నేను చేసిన పని సమర్ధనీయమని నేను భావించొచ్చు; లేదా మరొకడు నా విషయంలో గానీ మరొకరి విషయంలో గానీ ఇలాంటి పనినే చేశాడనే నెపంతో కావొచ్చు. దీనికి సమాధానం పరిస్థిని బట్టి ఆధారపడి ఉంటుంది.

ఉదాహరణకి నాకార్యానికి వచ్చే పర్యవసానాల భయంతో నేను బతకాలి. (లేనిపోని విషయాలపైన నా భయాలు కేవలం ఆధారం లేనివి కావచ్చు.) ఎప్పుడో చాలా కాలం క్రితం ఒకటి రెండు సార్లు గంజా పీల్చింతరవాత, మళ్ళా దాన్ని పీల్చడం మానేశాను; అది నాకు పడలేదనే కాదు; చట్టం అంటే ఆదరమూ, భయమూ ఉండి కాదు (ఇతర విషయాల్లో, ముఖ్యం అనుకుంటే, నేను చట్టాన్ని ఉల్లంఘించగలను); అరెస్టు అయి జైలుకు పోయేంత ముఖ్యమైంది కాదనుకున్నాను. అంతే కాదు; నేను అబద్ధాలాడడం, మోసం చెయ్యడం వల్ల మరొకరికి కష్టం కలుగుతే, దానికి పర్యవసానాలు కూడా ఉంటాయి; అవి నాకు సమస్య అవుతాయి. దానిని పరిష్కరించడానికి నేను పూనుకోవాలి.

అలాకాక, నేను చేసేపనివల్ల నాకు గాని మరొకరికి గాని కష్టం కలగదనుకోండి, అలాంటప్పుడు దాని విషయమై నేను అసలు విచారించాల్సిన అవసర మేముంటుంది?

ఈ విధమైన ఆలోచన వల్ల లాభ మేమిటంటే అది ఆత్మజ్ఞానానికి ఒక సాధనమయి, అనవసరమైన గమ్యాలూ, చింతలూ, భయాల్నించి విముక్తులమై, ఆత్మ రక్షణత్వ రహితమైన జీవితాన్ని గడపడానికి వీలవుతుంది. మరో లాభమేమిటంటే మనం ఇతరుల ప్రవర్తనని అంత త్వరగా వేలు చూపి తప్పుపట్టం.

ఈ విధమైన చింతన ఫ్లెచర్ ప్రతిపాదించిన ’పరిస్థితి’ నీతి5 వంటిది కాదు. ఇక్కడ ఈశ్వర ప్రస్తావనగానీ, ప్రేమ ప్రస్తావనగానీ లేదు. అయితే పరిస్థితి వాదాన్ని ఉద్దేశించి చెయ్యబడ్డ నైతిక సాపేక్షవాదం (moral relativism) అనే సవాలు దీనికి కూడా వర్తిస్తుంది. అయితే ఒక పరిస్థితిని గురించిన నా ఆలోచన కేవలం ఆ పరిస్థితి మీద ఆధారపడడమే కాదు, నా మీద కూడా ఆధార పడి ఉంటుంది. ఎందుకంటే పరిస్థితికి నా సమాధానం నేను పరిస్థితిని ఏవిధంగా చూస్తానో దాన్నిబట్టీ, నా నేపధ్యమూ, పూర్వ ప్రభావాల బలమూ, నా వ్యక్తిత్వ లక్షణాలూ, మానసికంగా అణిచిపెట్టుకున్న అనుభవాలూ -- వాటిని బట్టీ ఆధారపడి ఉంటుంది. అ పరిస్థితికి నా సమాధానం ఈ అంశాలన్నింటి మిశ్రమంమీద ఆధారపడి ఉంటుంది.
_____________________________
5 జోసెఫ్ ఫ్లెచర్ పరిస్థితి నీతి క్రైస్తవమతముపై ఆధారపడ్డ నైతిక సిద్ధాంతము. కొన్ని పరిస్థితుల్లో ప్రేమకోసరమని తక్కిన నైతిక నియమాలని పక్కన పెట్టవచ్చునని ఈయన బోధ.
_________________________________________

అయితే నా సమాధానం ఇది తప్పు ఒప్పు అని తత్క్షణమే నిర్ణయించేంత స్థిరమైనది కాదు. ఇతరులు దానిపై అలాంటి నిర్ణయాన్ని చేస్తారనుకోండి . కాని నాకు సంబంధించినంతవరకూ ఏ ఒక క్షణంలోనైనా నా సమాధానం నాకు సంతృప్తికరంగానైనా ఉంటుంది, అసంతృప్తికరంగానైనా ఉంటుంది. పరిస్థితుల్లో ఏమైనా మార్పులు వచ్చినప్పుడు పూర్వం సంతృప్తికరమైన సమాధానం ఇప్పుడు అలా కాకపోవచ్చు. మరో సమధానం సంతృప్తికరంగా అవుపించవచ్చు; దాని దృష్ట్యా నేను నా పూర్వ సమాధాన్ని మార్చుకోవచ్చు. అలా మార్చుకోవాలని ఉద్దేశించకపోతే, దాని ఫలితాలని అనుభవించడానికి నేను సిద్ధంగా ఉంటాను.

ఉదాహరణకి, ఒక సన్యాసిని తనకు గలిగిని అవాంచిత గర్భాన్ని పూర్తిగా మోసి బిడ్డని కనడనికి నిశ్చయించుకున్నదని నేను ఒకప్పుడు విన్నాను. ఆమె తన కార్యపు ఫలితాల్ని అనుభవించడానికి సిద్ధ పడ్డది. అంటే అది సన్యాసాన్ని వదిలి సాధరణమైన స్త్రీ గా అవడం, తననీ తన బిడ్డనీ పోషించుకోడానికి ఏదైనా ఉద్యోగాన్ని చూసుకోవడం, సాంఘిక నిందను ఎదుర్కోవడం లాంటివన్నమాట. వేరే పరిస్థితుల్లో అయితే కారాగారమూ, ఉరిశిక్షా వంటి భౌతిక మైన శిక్షల్ని కూడా అనుభవించడానికి సిద్ధపడొచ్చు. నేను ఆవిధంగా నా జీవితాన్ని తీర్చి దిద్దుకున్నాను కనక నా ఇచ్ఛ ఆవిధంగా ఉండొచ్చు. నేను పిరికిపందనయి మనసు మార్చుకుంటే, దాని ఫలితాల్నికూడా నేను అనుభవించాల్సి ఉంటుంది; అంటే అప్పుడు అది నేను ఎదుర్కొనే పరిస్థితి అవుతుందన్నమాట.

ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే, నా కార్యాల్ని ఇది తప్పూ ఒప్పూ, మంచిదీ, చెడుదీ అని నిష్పాక్షికంగా నిర్ణయించడానికి నిరపేక్షకమైన, నిష్పాక్షికమైన (objective) ప్రమాణాలేమీ లేవు. (అయితే ఆ నిర్ణయాల ఫలితాల్ని నేను అనుభవించాల్సిందే ననుకోండి). నేను వేటితో జీవించగలనో, ఏవి నాకు సంతృప్తి కరమైనవో (లేదా నేను వేటితో జీవించలేనో, ఏవి నాకు అసంతృప్తికరమైనవో) ఆ సమాధానాలని గురించి మాత్రమే నేను ప్రస్తావించగలను.

ఈ చింతనకు మరో అభ్యంతరం ఉండొచ్చు: ఈ విధానం పూర్తిగా మానసికమైంది. చర్యలు తప్పా ఒప్పా అనేటువంటి నైతిక ప్రశ్నలతో ఈవిధానానికి ప్రమేయమేలేదు. ఇది నైతికంగా నిర్ణయాలు తీసుకోవడానికీ, నీతి ప్రవర్తనను బోధించడానికీ అవసరమైన అతిముఖ్యమైన సాధనాన్ని మనకు లేకుండా చేస్తుంది.
నేను పైన చెప్పినట్టుగా, మనం నీతిని ఇతరుల చర్యల్లో తప్పొప్పుల్ని నిర్ణయించేందుకూ, ఈ నిర్ణయాలద్వారా మన అత్మయోగ్యతను (self-worth) పెంపొందించుకోడానికీ, మన చేతలు ధర్మమైనవని భావించడానికీ, మనం ఇతరులకంటే నైతికంగాగానీ మరోవిధంగాగానీ అధికులమని భావించడానికీ సాధనంగా ఉపయోగించుకుంటాం. నా దృష్టిలో మనం సమాజంలో ఉన్న పెద్ద సమస్య ఒకటేమిటంటే మనం ఇతరులన్ని అతి త్వరగా తప్పుపడతాం (ఉదాహరణకు, రాజకీయనాయకుల్ని లైంగిక విషయాల్లో వేలెత్తి చూపినట్టు), మనకూ వాళ్ళకూ అంతపెద్దగా తేడాలేదనీ, అలాటి పరిస్థితుల్లో మనం ఉంటే మనంకూడా అదేవిధంగా, బహుశా అంతకంటే నీచంగాకూడా ప్రవర్తిస్తామనీ పూర్తిగా తెలిసికూడా. అలాంటప్పుడు నీతి అనే ఈ ఆటను మనం ఎందుకు ఆడడం అని నేనంటాను.

ఈ సందర్భంలో నీతికీ చట్టానికీ తేడా ఉన్నదని చెబుతాను. ఉదాహరణకి, మా ఇంట్లో ఎవరైనా దొంగతనంచేస్తే నేను పోలీసులకి ఫిర్యాదు చేసి ఆదొంగని అరెస్టు చెయ్యిస్తాను. ఈ విషయం చట్టానికి సంబంధించింది. నేను చేసిన పని సరైనదేనని భావించి ఏవిధమైన నేరభావం లేకుండా ఉండగలను.
నేరానికి చెందిన న్యాయ వ్యవస్థ నేరస్తుడు ఎందుకు నేరం చేశాడో ఆ కారణాలని పట్టించుకోదు, నేరస్తుడిని శిక్షించడమే దాని ధ్యేయం. ఈ కారణంగా నేను పోలీసులకి రిపోర్టు చెయ్యకూడదనీ భావించవచ్చు. అలా భావిస్తే నేను దానికి అనుగుణంగా ప్రవర్తించి ఆ చర్య ఫలితాల్ని అనుభవిస్తాను. ఉదాహరణకి నేరాన్ని రెపోర్టు చెయ్యకపోవడంలో నేను చట్టాన్ని ఉల్లంఘించొచ్చు.

అయితే యుద్ధంలాంటి సంఘటనల విషయం ఏమిటి? నైతికనిర్ణయమనే శక్తివంతమైన సాధనాన్ని మనం కోల్పోవడంలేదా? ఉదాహరణకి, ఫలానా ఫలానా యుద్ధం అవినీతికరమైందని అనడానికి ఇక సాధ్యమవుతుందా? దీనికి నా సమాధానమిది: యుద్ధంలో ఈ పక్షం వారినిగానీ, వారి ప్రతిపక్షం వారిని గానీ విమర్శించుకుంటూ పోతే, యుద్ధ సమస్యని పరిష్కరించడానికి బదులు ఏదో ఒక పక్షంపక్క ఉండి యుద్ధాన్ని కొనసాగిస్తూంటాము. వియత్నాం యుద్ధానికి వ్యతరేకంగా రివర్సైడ్ పెద్దబజారులో (అంతకు పూర్వం బర్క్లీలో చేసినట్టే) ప్రదర్శన చేసిన కాలం గుర్తుకొస్తోంది. ఇతరులతో చేతులుకలిపి ఆ బజార్లో నిల్చున్నప్పుడు, అలానిల్చోవడం ద్వారానే నేను వచ్చేపొయ్యేవారి ముఖాల్లో కనబడే వ్యతిరేకతను గమనించాను -- అందరూ నన్ను చూచే ఆ ద్వేషపు చూపులూ, ఆగ్రహంతో చేసే చర్చలూ.

ఆ సందర్భం యుద్ధపు మూలాల్ని గురించి నన్ను అలోచించడానికి ప్రేరేపించింది. ఆ అలోచనవల్ల అసహనమూ, దురాశా, దౌర్జన్యమూ, ఇతరులపై ఆధికారాకాంక్ష, వైభవకాంక్షా, కీర్తి ప్రతిష్ఠలపై అభిమానం -- ఇవే యుద్ధానికి మూలకారణాలనీ, ఆ కారణాలు నాలోకూడాలేకపోలేదనీ స్పష్టమయింది. అంతేకాదు; ప్రపంచం అంతటా ఉన్న క్షుద్బాధ, దారిద్ర్యం వీటి మూలాలు, అంటే నా అత్మ రక్షణత్వం, స్వాపేక్షా (self-interest), అవసరాలకంటే మిన్నగా సంపదని కూడబెట్టుకోవలనే వాంఛా, నా జీవనవిధనంలో భాగంగా ఉన్నాయనీ స్పష్టమయింది.

ఇతరులన్నా వారి అవసరాలన్నా లెక్కచెయ్యకపోవడం వల్ల ప్రపంచంలో ఎంతో హాని జరుగుతుంది, ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. నాకూ ఇతరులకూ అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఏంచెయ్యాలి? సున్నిశితమైన మనసులేని వాడికి ఇతరుల విమర్శలూ, వారి నైతిక నిర్ణయాలూ అంటవు. అతని అవసరాలే ఆ సున్నిశితత్త్వాన్ని(sensitivity) కలిగించాలి.

బహుశా చిన్నతనంలో ఉన్నప్పుడే పిల్లలకు ఈ సున్నిశితత్త్వాన్ని బోధించే అవకాశం ఉందేమో. ఉదాహరణకు, ఒక పిల్ల మరొక పిల్లని కొడితే ఆ పిల్లకు బాధ కలుగుతుందని చూపొచ్చు. (ఒకసారి, ఇది మా అమ్మాయికి [దానికి అప్పుడు 4, 5 ఏళ్ళ వయసు కాబోలు] చేతద్వారా చూపాను: పార్కులో మా అమ్మాయి మరో అమ్మాయిని కొట్టింది. నేను నా వేళ్ళతో మా అమ్మాయి చేతిమీది చురుక్కుమనేట్టుగా ఒక్కసారి దెబ్బ వేశాను, "నువ్వు కొడితే ఆ అమ్మాయికి ఇలా ఉంటుంది; కొట్టకు," అంటూ. నేను అమ్మాయిని మళ్ళా మందలించాల్సిన అవసరం రాలేదు.) ఈ విధంగా చూపగలిగితే అది మనం పిల్లలకి ఇవ్వగలిగి ఉత్తమమోత్తమమైన విద్య. మా అమ్మాయికి ఆపిల్లమీద ఉండే అయిష్టతను నేను పోగొట్టలేక పోవచ్చు. అయితే కనీసం ఒక సమస్య ఉన్నదనే ఎరికనయినా కలిగించాను (లేకపోతే నాకు సమాధానం చెప్పాలి కదా!). తరవాత అది ఇలాంటి పన్లు దొంగతనంగా చెయ్యొచ్చుననుకోండి; లేక దౌర్జన్యం కోసమే దౌర్జన్యాన్ని చెయ్యొచ్చు. .... నేను ఈ విషయాన్ని మరింతగా చర్చించనక్కర్లేదు. మా అమ్మాయికి పాఠంచెప్పడం నా అవసరమే కావొచ్చు (నైతికంగా అవసరం అనికాదు, కాని మా అమ్మాయి తక్కిన పిల్లల విషయమైన ప్రవర్తన నాకు ఒక సమస్య అయింది కాబట్టి దాని విషయం నేను పట్టించుకోవాల్సివచ్చింది. ఇతరుల జీవిత మార్గాల్ని మార్చడానికి పూనుకోబోయేముందు, వాళ్ళని తొందరబడి తప్పుపట్టేముందు, నా జీవిత విధానంలో ఏ మార్పులు జరగడానికి సాధ్యమవుతుందో కూడా చూస్తాను. నా అభిప్రాయంలో నైతికం తప్పొప్పులు పట్టడంకంటే ఈ పద్ధతి మెరుగు. వాస్తవానికి, ఈ మార్గం విషయాల్ని స్పష్టంగా చూడడానికీ, కాలక్రమేణా మన సమస్యల్ని పరిష్కరించుకోవడానికీ తక్కిన మార్గాలకంటే మరింత ఎక్కువగా సహాయపడుతుంది.

సాంప్రదాయికంగా వచ్చిన నైతిక పద్ధతిలో లోపమేమిటంటే మన మాటలకూ చేతలకూ ఉన్న అంతరాన్ని అది తొలగించలేదు; ఎందుకంటే, అది మన వాంఛల్నీ, భావాల్నీ, ఆవేశాల్నీ, మన సహజ స్వభావాన్నీ లెక్కచెయ్యదు. మనచుట్టూ కోర్కెలూ, గమ్యాలూ ఉన్నంతవరకూ మన కర్తవ్యానికీ మన వాస్తవ ప్రవర్తనకీ అంతరం ఉండక తప్పదు. నా మార్గం నేపధ్యంలొ ఉండే ప్రశ్న ఏమిటంటే ఈ అంతరాన్ని తొలగించగలం ఎలా అని.

నీతిని బహిరంగంనించి తొలిగించి ఆంతరంగికం చేస్తున్నానీ, దాని వల్ల నీతిని బహిరగా చర్చ చెయ్యడానికి వీలుకాకుండా చేస్తున్నాననీ మీరనొచ్చు. అంటే మరొకరి చర్యల విషయంలో నైతిక నిర్ణయాలు చెయ్యలేకపోతే, ఇంకొకరి ప్రవర్తన ఎంత ఏహ్యమైనదైనా మనం దానివైపు వేలుచూపి ఇది తప్పు అనడానికి వీలుండదు; అంటే దాన్ని బహిరంగంగా చర్చించడానికి వీలుండదు; విమర్శించడానికి వీలుండదు; దాన్ని పొగడడానికి గానీ నిందించడానికి గానీ వీలుపడదు. అంటే దీని అర్ధం ప్రజల సంఘవ్యతిరేక ప్రవర్తనని మార్చలేమని. ఇదంతా నిజమైనప్పటికీ, బహిరంగంలో మనం చేసే చాలా విషయాల్ని పెద్ద మార్పుల్లేకుండా సమస్యా పరిష్కార రంగంలోకి తీసుకెళ్ళొచ్చు. ఆవిధంగా మనం పురోగతికి మరింత ఎక్కువగా దోహదం చేసినవాళ్ళంకూడా అవుతాం.

ఎవరైనా ఒక నైతిక నిర్ణయం చేశారనుకోండి. ఆప్పుడు అలా చేయడం నైతికంగా తప్పు అనాలా అని కూడా మీరడగొచ్చు. నాకు సంబంధించినంతవరకూ అది తప్పూ కాదు, ఒప్పూ కాదు. దానివల్ల నాకు ఇబ్బంది కలగొచ్చు; మరొకరు నా ప్రవర్తనలో ఉన్న సమస్యని వేలెత్తి చూపుతూంటే, అది నా ప్రమాణాలకే వ్యతిరేకమైనప్పుడు, నేను నేరస్థుడినని భావించొచ్చు. అలాంటి సందర్భంలో అ నిర్ణయాన్ని అదే ప్రాతిపదికమీద పరిగణిస్తాను.

అయితే నా నేరభావం విషయం ఏమిటి? అది మరి ఒక నైతిక సమస్య కాదా? (నా పద్ధతికి ఒచ్చే ఆక్షేపణల సారాంశం ఇది.) నేరభావమూ, అంతరాత్మలో నేరంగా భావించడమూ ఒక వ్యక్తి తాను తన కర్తవ్యం అనుకున్నదానికీ తాను వాస్తవంగా చేసినదానికీ కలిగిన సంఘర్షణ ఫలితం. కర్తవ్యం అంటే కేవలం నైతికమైన కర్తవ్యమే కాదు. ఒక వ్యక్తి తను ఇతరులతో ఏ విధంగా కలిసి మెలిసి ఉండాలో, ఇతరుల విషయంలో ఏ విధంగా ప్రవర్తించాలో అనుకునే వివిధ పర్యాయ మార్గాల్లో ఒకటి మాత్రమే కావచ్చు. ఈ కర్తవ్యంలో నైతిక ప్రమాణాలు ఉండొచ్చు, లేకపోవచ్చు.

అంతరాత్మ విషయంలో మరో గమనిక: నా సిద్ధాంతానికీ ఫలానా విధంగా అచరించాలా వద్దా అని నిర్ణయించడానికి మన అంతరాత్మ చెప్పినట్టే నడుచుకోవాలనే సిద్ధాంతానికీ సాదృశ్యం ఉందని కొందరనవచ్చు. ఈ భావం సగం మాత్రమే నిజం. అంతరాత్మ అంటే సాధారణంగా నైతికంగా మనకి ఆజ్ఙలు ఇచ్చేటట్టి అంతర్వాణి అనుకుంటాం. సమస్యాపరిష్కార మార్గం అలాకాక, నైతిక విషయాల్నిగురించి ఆలోచించడంతో పాటు, స్వాపేక్ష, ఆవేశాల వంటి విషయాల్నికూడా గమనిస్తుంది.

అసలు వాస్తవమేమిటంటే, మనకు ఇతరుల విషయంలోనూ, ఇతర జనసమూహాల విషయంలోనూ, దేశాల విషయంలోనూ ప్రమాణాలు ఉన్నట్టే, మన విషయమై మనకు నైతిక ప్రమాణాలు ఉంటాయి. మనం ఆ ప్రమాణాల్ని మన సమాజంనించి బదులుతెచ్చుకున్నాము. వాటిని ఉపయోగించి మనం మనల్ని శ్లాఘించుకోవడమో నిందించుకోవడమో చేస్తాం. మనం వాటిని అవశ్యం నమ్ముతాము. నా పద్ధతి విశేషత ఏమిటంటే, వాటిని ప్రమాణాలనకుండా భావాలనడం. ఫలనాది కర్తవ్యమూ, ఫలానాది నిషిద్ధమూ అని భావిస్తాం. తప్పొప్పులు ఆ భావాల అభివ్యక్తాలే (expressions). మనం ఉన్నాయని నమ్మినప్పటికీ, నిష్పాక్షికంగా వాటిల్లో సరైనవంటూ ఏమీ లేవు,.

ఆ భావాలు (విది నిషేధాల గురించి) కేవలం నా ఆలోచనలేనా, లేదా, నా మతంలో మనం చేతలు ఎలా ఉండాలీ ఉండకూడదూ అనే విషయాలా? నా ప్రతిపాదన కేవలం ప్రాతీతికవాదం (Subjectivism) అనే సవాలు ఇది. దీనికి నా సమాధానం ఏమిటంటే భావాలకీ నైతిక ప్రమాణాలకీ తేడాలేదనీ, నైతిక ప్రమాణాలు కేవలం నా మనసిక వ్యవస్థలో భాగాలనీ.

స్వలాభం కోసం చేసే యత్నంలో ఇతరుల కష్టనష్టాల్నికూడా లెక్కచేస్తూ, వ్యక్తి స్వలాభానికీ విధికీ మధ్య సామరస్యం కల్పిస్తూ, ఆవిధంగా సమాజం నైతికమయ్యేటట్టు చెయ్య ప్రయత్నించే ఏ నైతిక సిద్ధాంతానికీ ఈ మార్గానికీ తేడాలేదని ఎవరైనా అనొచ్చు. ఆమేరకు, సమాజం మొత్తపు శ్రేయస్సును పరిరక్షింపచూచే ఉపయోగితావాదానికీ, విధి వాదానికీ ఈ సిద్ధాంతం సాదృశమైనదని అని కూడా అనవచ్చు.
ఈ క్రింది మౌలిక భేదాలను మినహాయిస్తే, ఈ ఆక్షేపణ నిజమేనని నా సమాధానం: మొదటిది, ఈ సిద్ధాంతం వ్యక్తిపైన అనవసరమైన తప్పొప్పులనుగురించిన ప్రమాణాల్ని అనుసరించే భారం వెయ్యదు. రెండోది, ఒక విశేషమైన పరిస్థితి సందర్భంలో వ్యక్తి స్వలాభాన్నీ అతని భావాల్నీ తక్కిన సిద్ధాంతాలకంటే మెరుగుగా సమన్వయ పరుస్తుంది. మూడోది, పై కారణాలవల్ల, వ్యక్తి స్వలాభానికీ, అతని విధికీ మధ్య ఉండే అంతరాన్ని తగ్గిస్తుంది.

ఆఖరి గమనిక ఒక్కటి: ఇది హ్యూమ్ నైతిక సిద్ధాంతానికి, లేదా దాని ఆధునిక రూపాంతరం జ్ఙానసమేతమైన స్వలాభానికీ (enlightened self-interest) అంత భిన్నమైనది కాదని ఎవరైనా అనవచ్చు. ఆ సిద్ధాంతం అహంవాదానికి మరోరూపం. వ్యక్తి సుఖమే (నా మాటల్లో చెప్పాలంటే ’వ్యక్తి మానసికి వ్యవస్థలో సమత్త్వాన్ని) పరమ శ్రేయమనీ, ఈ ప్రమాణం ఆధారంచేసుకునే చేతల్ని మంచి చెడులుగానూ, తప్పొప్పులుగానూ నిర్ణయిస్తామనీ నేను వాదిస్తున్నాననొచ్చు. దీనికి నా సమాధానం ఏమిటంటే, నా సిద్ధాంతం ఆ విధంగా కనపడొచ్చు; కానీ తేడా ఏమిటంటే, నా సిద్ధాంతం నైతిక మనస్తత్త్వాన్ని లెక్కలోకి తీసుకుంటుంది; నైతిక సిద్ధాంతాలు సాధరణంగా దాన్ని లెక్క చెయ్యవు.

* * *

1 Comments:

Anonymous Ashok said...

Chala bagundi article super

August 21, 2020 at 10:57 AM  

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home